జ్ఞాపకశక్తి, రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఔషధాన్ని పంపిణీ
సుల్తానాబాద్,ఆగష్టు4(కలం శ్రీ న్యూస్):
జ్ఞాపక శక్తిని, రోగ నిరోధక శక్తిని, మేధాశక్తిని పెంపొందించే ఆయుర్వేద ఔషధాన్ని వికాస తరంగిణి వారి ఆధ్వర్యంలో ఆదివారం పంపిణీ చేశారు. స్థానిక శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ఔషధ పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ బాలాజీ రావు ప్రారంభించారు. చిన్న జీయర్ వారి ఆశ్రమంలోని ఆయుర్వేద ఆసుపత్రి నుంచి తయారు చేయబడిన ఈ ఔషధం జీరో వయస్సు నుంచి 16 ఏళ్ల వయసు గల పిల్లలకు పంపిణి చేశారు. పరిగడుపున పిల్లలకు ఈ ఔషధం వేయించడం వలన రోగ నిరోధక శక్తి, జ్ఞాపకశక్తి, మేధాశక్తి పెంపొందించబడుతుందని, ఆలోచనలు మెరుగుపరుస్తాయని, అలాగే మాటలు సక్రమంగా రాని వారికి సహాయపడుతుందని వికాస తరంగిణి చీఫ్ కో ఆర్డినేటర్ సాదుల సుగుణాకర్, కో ఆర్డినేటర్ పోదిల్ల రమేష్ తెలిపారు. అలాగే ఆటిజం నుంచి కాపాడుతుందని, జీర్ణక్రియను పెంపొందిస్తుందని వివరించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం ఉన్న రోజున ఈ మందును సేవించాలని, పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కోసం 21 నెలల పాటు ఈ ఔషధాన్ని ఇవ్వాలని సూచించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం ఉన్న రోజున స్థానిక శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఈ ఔషధాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని చిన్న జీయర్ స్వామి మంగళా శాసనాలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల వనజ, పొన్నమనేని స్వరూప, సాదుల సునిత, గొట్టం రమేష్,అల్లాడి భగవాన్ తదితరులు పాల్గొన్నారు