Tuesday, December 3, 2024
Homeతెలంగాణపామాయిల్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి.

పామాయిల్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి.

పామాయిల్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.

కొలనూరు లోని పీ.హెచ్.సీ, ఓదెల- కొలనూరు రోడ్డు ప్రారంభించి,కాల్వ శ్రీరాంపూర్ లోని పెద్దరాతుపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్ గౌడ్ , ప్రభుత్వ సలహాదారులు వేణు గోపాల్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.

కాల్వ శ్రీరాంపూర్,జులై19(కలం శ్రీ న్యూస్):

ఆయిల్ పామ్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పెద్దపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయరమణా రావు, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి పాల్గొన్నారు.

ఓదెల మండలం కొలనూరు గ్రామం చేరుకున్న మంత్రులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం 13 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పెద్దపల్లి నుంచి ఓదెల వయా కొత్తపల్లి, కొలనూరు వరకు వెళ్ళే రోడ్డును, కోటి 56 లక్షల వ్యయంతో నిర్మించిన కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని మంత్రులు ప్రారంభించారు.

అనంతరం రోడ్డు మార్గం ద్వారా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామానికి చేరుకున్న మంత్రులు, అక్కడ తిరుమల ఆయిల్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిచే 170 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రుల బృందం శంకుస్థాపన చేసి అనంతరం కాల్వ శ్రీరాంపూర్ రెడ్డి గార్డెన్స్ లో ఆయిల్ పామ్ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు తమ అనుభవాలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళారు. ఆయిల్ పామ్ సాగు అంతర్ పంటల సాగు, వాటితో వచ్చే ఆదాయం వంటి పలు అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన రైతు గత సంవత్సరం నుంచి 8 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నామని, సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ అధికారులు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు  మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర రైతాంగం తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. నీటి పారుదల, విద్యుత్ రంగం, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. రైతులకు రుణ మాఫీ చేయాలనే సంకల్పంతో రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి లక్ష రూపాయల వరకు రుణం ఉన్న రైతుల ఖాతాలలో మాఫీ సొమ్ము జమ చేశామని అన్నారు. పెద్దపెల్లి జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఇప్పటి వరకు 2500 ఎకరాల వరకు మాత్రమే జరిగిందని , ప్రస్తుత సంవత్సరం ఆయిల్ పామ్ విస్తిర్ణం 10 వేల ఎకరాలకు పెరగాలని, ఆసక్తి గల రైతులందరిని ఆయిల్ పామ్ దిశగా మళ్ళీంచాలని అన్నారు. ఆయిల్ పామ్ పంట మొదటి మూడు సంవత్సరాలు అంతర్ పంటల ద్వారా ఆదాయం వస్తుందని, రైతులు పొద్దు తిరుగుడు అంతర్ పంట క్రింద వేస్తే ఇదే కంపెనీ మద్దతు ధరపై కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ అధికారుల సూచనలు రైతులు పాటించాలని అన్నారు. మనకు అందుబాటులో ఉన్న భూమి లోనే ఎక్కువ పంటలు పండించాలని, రైతులు పంట మార్పిడి విధానాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. మనకు అవసరమైన అన్ని రకాల నేలలు వాతావరణం, వనరులు అందుబాటులో ఉన్నాయని వీటిని వినియోగించుకొవాలని అన్నారు. మన దేశానికి ఆయిల్ పామ్ 100 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉందని, కానీ మన దగ్గర ప్రస్తుతం కేవలం 3 లక్షల 96 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే పండుతుందని, మిగిలినవి ఇండోనేషియా, మలేషియా వంటి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు.  భారతదేశంలో అత్యధికంగా పామ్ ఆయిల్ పండిస్తున్నది తెలుగు రాష్ట్రాలు మాత్రమేనని, ప్రతి ఎకరానికి మూడు , నాలుగు సంవత్సరాల సమయానికి పామ్ ఆయిల్ రైతుకు 51 వేల వరకు సబ్సిడీ సొమ్ము ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఆయిల్ ఫామ్ మొక్కలకు, మందులకు, డ్రిప్ ఏర్పాటుకు సైతం సబ్సిడీ అందజేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలు వినియోగించుకుని ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని మంత్రి సూచించారు. తుఫాన్, కరువు వల్ల పామ్ ఆయిల్ పంటకు ఇబ్బంది లేదని, ఈ పంటకు కోతుల బెడద ఉండదని, అధికంగా కూలీలు అవసరం లేదని అన్నారు. ప్రజా ప్రతినిధులు విస్తృతంగా పర్యటిస్తూ పామ్ ఆయిల్ పంట సాగు అధికంగా జరిగేలా చూడాలని మంత్రి కోరారు. భూమి ఉన్న ప్రజా ప్రతినిధులు అంతా తప్పనిసరిగా పామాయిల్ పంట సాగు చేయాలని మంత్రి సూచించారు. ప్రతి ఒక్క రైతు అవకాశం ఉన్న మేర ఆయిల్ పామ్ పంట సాగు జరిగేలా చూడాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు.

ఈ సందర్బంగా రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు ఎకరానికి ఖర్చులు పోగా లక్ష వరకు ఆదాయం వస్తుందని, దీనికి కోతుల బెడద ఉండదని, రైతుల వద్ద నుంచి ఆయిల్ పామ్ కొనుగోలు చేసేందుకు తిరుమల ఆయిల్ కెమికల్స్ కంపెనీ ద్వారా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం మనకు అవసరం ఉన్న తినే ఆయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీనిని తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తరించాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ పనిచేస్తుందని , మన పెద్దపల్లి జిల్లాలో సైతం 45 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ పంటల సాగు జరగాలని అన్నారు. మహాలక్ష్మి పథకం క్రింద మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయడం ద్వారా ఆర్టీసీ సంస్థ బలోపేతం అవుతుందని, స్థానిక శాసన సభ్యుల డిమాండ్ మేరకు పెద్దపల్లిలో నూతన బస్సు డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ, క్రమ శిక్షణతో ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తీసుకుని వస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు విస్తరణ వంటి కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం నిన్న లక్ష రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో లక్ష రూపాయల వరకు రుణం ఉన్న దాదాపు 30 వేల మంది రైతులకు 150 కోట్లు మాఫీ చేశామని అన్నారు. ఆయిల్ పామ్ సాగు వల్ల రైతు ఆదాయ వనరులు పెరుగుతాయని అన్నారు. రైతులు పండించిన పామ్ ఆయిల్ కొనుగోలు చేసి ఆయిల్ తయారు చేసేందుకు వీలుగా 24 ఎకరాల స్థలంలో 170 కోట్ల పెట్టుబడితో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందని, దీని ద్వారా నేరుగా 200 మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, 500 మంది యువతకు పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అన్నారు.వరి పంటకు సంబంధించి కూడా విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. రైస్ బ్రాన్ ఆయిల్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, 100 కోట్ల పెట్టుబడితో ప్రతి రోజు 300 టన్నుల ఆయిల్ తయారీ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు.  టెయిల్ ఎండ్ ప్రాంతాలకు శాశ్వతంగా సాగునీటి కష్టాలు తీర్చేందుకు పత్తి పాక రిజర్వాయర్ ఏర్పాటుకు సర్వే పనులు జరుగుతున్నాయని అన్నారు.

ఈ సందర్బంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు  మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుతో తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందవచ్చని అన్నారు. రైతు ఎకరానికి లక్ష రూపాయల వరకు ఆదాయం ఆర్జించవచ్చని, తాను కూడా పామ్ ఆయిల్ పంట సాగు చేయడం జరుగుతుందని, రైతులంతా ముందుకు వచ్చి పామ్ ఆయిల్ సాగు చేయాలని అన్నారు. ఎస్సారెస్పీ డి83, డీ86 చివరి ఆయకట్టు సాగు నీరు సమస్య పరిష్కారం కోసం పత్తిపాక రిజర్వాయర్ నిర్మించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ని కోరగా వారు సానుకూలంగా స్పందించి బస్సు డిపో ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది..పొన్నం ప్రభాకర్ కి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపడం జరిగింది…

ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు టి.భాను ప్రసాద్ రావు, హరికర వేణుగోపాల్ ,రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, అదనపు కలెక్టర్ లు జే .అరుణ శ్రీ , జీ.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, డిసిపి ఎం.చేతన , రెవెన్యూ డివిజన్ అధికారి బి. గంగయ్య,ఎమ్మార్వో లు ,పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ సీఈఓ కేశవ్ కళ్యాణ్ కర్, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!