కమిషనర్ గారు మా సమస్యలు మీకు పట్టవా.
- మా ప్రాణాలు అంటే మీకు అంత చిన్న చూపా.
- పందులకు ఆవాస కేంద్రం చేసిన పందుల పెంపకం దారుడు.
సుల్తానాబాద్,జులై12(కలం శ్రీ న్యూస్):
తమ సమస్యలు పరిష్కరించండి మహాప్రభో అంటూ గత,ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ లకు ఎన్ని మార్లు మొరపెట్టుకున్న ప్రయోజనం లేకపోవడం పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు పట్టణం కూతవేటు సమీపంలో, మరీ ముఖ్యంగా నిత్యం వందలాది మంది ప్రయాణించే రహదారి. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బస్టాండ్ ఆవరణలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం కారణంగా పట్టణ ప్రజలు, ప్రయాణికులు అధికారుల పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ ఆవరణలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో బస్టాండ్ ఆవరణలో మురుగు నీరు నిల్వ వలన కంపు వాసన వస్తుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అదీకాక బస్టాండ్ సమీపాన ఉన్నటువంటి హోటల్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వాహకులు,పండ్ల దుకాణం దారులు వ్యర్థ పదార్థాలను బస్టాండ్ ఆవరణలో పారేయడం వల్ల పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.ఇదే అదునుగా భావించిన సదరు పందుల పెంపకం దారుడు సుమారు 15 పందులను పెంచుతూ,బస్ స్టాండ్ ను పందులకు ఆవాస కేంద్రంగా చేశాడు. దీనితో ప్రయాణికులు బస్టాండ్ లోపలికి రావాలంటే జంకుతున్నారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్య పైన పలుమార్లు గత,ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ లకు తాము ఎదుర్కొంటున్న సమస్యను క్షుణ్ణంగా వివరించినప్పటికీ ఏ ఒక్క కమిషనర్ శాశ్వత పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాకాలం లో వర్షపు నీరు, ఇటు మురుగునీరు నిల్వ వలన దోమలు, ఈగలు ఎక్కువై కాలనీ వాసులకు మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఏదేమైనా ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర నుండి మేల్కొని సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజల కోరుతున్నారు.
రాధారపు సంపత్,15 వ వార్డు నివాసి
నేను గత 17 సంవత్సరాలు గా 15 వ వార్డు లో నివాసం ఉంటున్నాను. సుమారు 10 సంవత్సరాల నుండి ప్రధానంగా ఈ సమస్య ఎక్కువ అయిందని. ఈ సమస్య పై పలు మార్లు మున్సిపల్ కమిషనర్ లకు మా గోడు వెళ్లబోసుకుంటే తూతూ మంత్రంగా తాత్కాలికంగా శుభ్రం చేసి, పై పైన బ్లీచింగ్ పౌడర్ చల్లి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, శాశ్వత పరిష్కారం చూపడం లేదని. ప్రభుత్వం మారినా కూడా మా సమస్యకు పరిష్కార దిశ అడుగులు వేయలేదని, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బస్టాండ్ కాంపౌండ్ వాల్ కు కింద రంధ్రం చేస్తే కాంపౌండ్ వాల్ కు అవతల ఉన్న మున్సిపల్ నాలా లోకి వెళ్లే లాగా ప్రణాళిక తీసుకుంటే సమస్య గంటలో శాశ్వత పరిష్కారం లభిస్తుందని,ఈ సమస్యను అధికారులు చొరవ తీసుకుంటే ఓ పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.