వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజ్జన్న
సుల్తానాబాద్,జులై10(కలం శ్రీ న్యూస్):
వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పిలుపునిచ్చారు.
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు, అధికారులతో, ప్రజా ప్రతినిధులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మొక్కలు నాటారు.
ముందుగా పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యే విజయరమణ రావుకు విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మాట్లాడుతూ..చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 27 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వన మహోత్సవంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విధిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలన్నారు. సుల్తానాబాద్ మండలంలో 1 లక్ష 25 వేల మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి 6 పండ్ల, పూల మొక్కలు ఇవ్వడం జరుగుతుందని, ఇచ్చిన మొక్కలను ప్రతి ఒక్కరు విధిగా నాటి మొక్కను సంరక్షించేందుకు కృషి చేయాలి అన్నారు. మొక్కలు నాటడం వల్లే వర్షాలు విరివిగా కురుస్తాయని, దీనివల్ల చెరువులు కుంటలు నిండి భూగర్భ జలాలు కూడా పెరిగి రైతులు పంటలు పండించుకోవడానికి నీటి కొరత లేకుండా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.