- పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి అడుగులు..
- రిజర్వాయర్ తో పెద్దపల్లి జిల్లాకు మహర్ధశ..
పెద్దపల్లి,జులై8(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లి జిల్లాలో ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణకు పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. పతిపాక రిజర్వాయర్ పూర్తి చేస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆ దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్సారెస్పీ ఉన్నత అధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు. పెద్దపల్లి జిల్లా రైతుల చిరకాల స్వప్నం అయిన పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణమే ధ్యేయంగా ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారు. 7.78 టీఎంసీల కెపాసిటితో నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని, దేవికొండ రిజర్వాయర్ నుండి లిఫ్ట్ ద్వారా, గ్రావిటీ కెనాల్ ద్వారా కూడా నీటిని సరఫరా చేసేలా ప్రతిపాదనలు వారం రోజుల్లో తయారు చేయాలని ఆదేశించారు. ఎస్సారెస్పీ సీఈ సుధాకర్ రెడ్డి, ఈఈ సంతు ప్రకాష్ రావు, జెఈ హరీష్, మోతె ప్రాజెక్టు మేనేజర్ కిరణ్ కుమార్ తో చర్చించారు. రిజర్వాయర్ యొక్క మ్యాప్ ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. దీంతో పెద్దపల్లి జిల్లా రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణంపై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు పట్టు వదలని విక్రమార్కుడు వలే పని చేస్తుండం జిల్లా రైతులకు మేలు చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో జిల్లా మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో పత్తిపాక రిజర్వాయర్ ను స్థానిక శాసనసభ్యులతో కలిసి సందర్శించి పత్తిపాక రిజర్వాయర్ ను నిర్మించి తీరుతామనే మా సంకల్పం నెరవేరాలని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు.