చిన్నారి పై హత్యాచారం చాలా దురదృష్టకరం.
మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క
సుల్తానాబాద్,జూన్16(కలం శ్రీ న్యూస్):ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఆపై హత్య ఘటన దురదృష్టకరమని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, ధనసరి అనసూయ సీతక్కలు స్పష్టం చేశారు.
ఆదివారం రోజున పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని రైస్ మిల్లులో ఘటన స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ చిన్నారిపై బీహార్ కు చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడడంతో పాటు కిరాతకంగా హత్య చేయడం సభ్య సమాజం క్షమించదన్నారు.తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం జరపడంతో పాటు హత్య చేయడం అతి కిరాతకమని అన్నారు. సంఘటన సమాచారం అందగానే పోలీసులు స్పందించి గంట వ్యవధిలోని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని,అయితే అప్పటికే చిన్నారి మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.
సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి నిందితుడిని వెంటనే పట్టుకోవడంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపేలా ఆదేశించారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.