పట్టభద్రుల ఎమ్మెల్సీ గా తీన్మార్ మల్లన్న ఘన విజయం
ఖమ్మం, జూన్ 08(కలం శ్రీ న్యూస్):
ఉమ్మడి వరంగల్,ఖమ్మం,నల్లగొండ జిల్లాల పట్టభ ద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలుపొందారు. ఉప ఎన్నిక ఫలితం శుక్రవారం రాత్రి వెలువడింది.
మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజేత వెల్లడి కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలోనూ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్ పైచేయి సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి కన్నా ముందుగా కోటా ఓట్లు 1,55,095 ఓట్లు సాధించి విజయం సాధించారు. కాంగ్రెస్,బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ సాగింది.
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా శుక్రవారం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ ఎన్నికల బరిలో ఉన్న 52 మందిలో చివరి అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు.
వెయ్యి ఓట్లలోపు ఉన్న అభ్యర్థులకు పోలైన ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని ఒక్కొ క్కరిని తొలగిస్తూ వచ్చారు. ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు నెగ్గాలన్నా పోలైన 3,36, 013 ఓట్లలో 23వేలకు పైగా చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 50శాతం +1 వచ్చిన అభ్యర్థిని విజేతగా నిర్ణయించారు.
ఈ మేజిక్ ఫిగర్ 1,55,095ను తీన్మార్ మల్లన్న ముందుగా అందుకోవడంతో ఆయన్ను విజేతగా ప్రకటించారు.