ఆహార తనిఖీలు ఎక్కడా…?
పెద్దపల్లి,జూన్3(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లాలో,పలు పండలాల్లో అనేక రకాల పాస్ట్ సెంటర్లు, బిర్యానీ సెంటర్ లు రోడ్ల వెంబడి వెలుస్తున్నాయి. జిల్లాలో దాదాపు 50 వేల పై వరకు హోటళ్ళు ఉంటాయనీ అంచనా. అందరికీ కావలసింది తిండే కదా. ఆహారంలో కల్తీ, రోగాలతో కుస్తీ సామాన్యులకు తప్పడం లేదు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు కార్యాలయం నుంచి కదలరు. తనిఖీలు లేకపోవడంతో ప్రజలు నాణ్యత లేని ఆహారాన్ని తిని అనారోగ్యం పాలవుతున్నారు. నాణ్యమైన మంచి నూనె వాడరు, వాడిన నూనె నే మళ్ళీ పలుసార్లు వాడినా అడిగే నాథుడు లేడు. బిర్యానీలో ఆకర్షించే రంగులు, నూడుల్స్ రుచిగా ఉండేందుకు కొన్ని రసాయనిక పదార్థాలు కలుపుతున్నారు.
ఇక మార్కెట్లో పలురకాల అప్పడాలు, పచ్చళ్ళు, చిప్స్, కారం, చిన్న పిల్లలు తినే తిండి ప్యాకెట్లు ఊరూ పేరూ లేనివి అనేకం కనిపిస్తున్నాయి. వంటకాలకు రంగు తెప్పించేందుకు నిషేధిత టార్ట్రాజైన్ అనే సింథటిక్ రసాయనాన్ని కలుపుతున్నారు. ఇక కిరాణా షాపుల్లో ఎక్స్ పెయిరి డేట్ అయిపోయిన పిండి,షాంపూ,నూనెలు, హెయిర్ ఆయిల్ అమ్ముతున్నారు. తమ సమస్య మీద ఫిర్యాదు చేసేంత శ్రద్ధ, ఆలోచన ఉండవు ఈ జనాలకి పట్టింపులేదు. ఒకవేళ ఫిర్యాదు చేయాలని కొందరు అనుకున్నా ఎక్కడ, ఎవరికి ఇవ్వాలో తెలియని స్థితి. అందువల్ల ప్రతి ఫుడ్ సెంటర్‌లోనూ, హోటళ్ళలోనూ, చికెన్, కిరాణా షాపుల్లో సంబంధిత ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పేరు, ఫోన్ నెంబర్ వివరాలను ప్రజలకు తెలిసేలాగా ఉంచితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఆహారంలో కుళ్లిన మాంసం, బూజు వంటివి ఉన్నా, నాణ్యత లేకున్నా ప్రజలు ఫోటోలు, వీడియోలతో సంబంధిత అధికారికి ఫిర్యాదు చేస్తే, వాటిని పరిశీలించి, చర్యలు తీసుకున్న తరువాత ఆ విషయాన్ని సదరు అధికారి ఫిర్యాదుదారునికి తెలియజేయాలి. ప్రజలకు ఈ సౌకర్యం ఉన్నప్పుడు వ్యాపారం చేసే వారికి భయం కూడా ఉంటుంది. అప్పుడే ఈ కల్తీలు అరికట్టవచ్చు. ఇటీవల కరీంనగర్ లో ఆకస్మిక తనిఖీలు చేస్తే అనేక బాగోతాలు బయటపడ్డాయి. ఏది ఏమైనా ఇప్పటికైనా సంబంధిత పెద్దపల్లి జిల్లా అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.