ఇప్పుడే ఆమరణ నిరాహార దీక్షలు వద్దు.
జూన్ 2 వరకు నిరసన కార్యక్రమాలు చేపడుదాం.
ఇళ్ల స్థలాలు, ఇండ్లు సాధించుకునే వరకు పోరాడుదాం.
టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్.
పెద్దపల్లి,మే16(కలం శ్రీ న్యూస్):: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంజూరు కోసం ఇప్పుడే ఆమరణ నిరాహార దీక్షలు చేయడం వద్దని, జూన్ రెండు వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టి యు డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అన్నారు. మంగళవారం జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ అధ్యక్షతన పెద్దపల్లిలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే ఐజేయు సంఘానికి 57 ఏళ్ల పోరాట వారసత్వం ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోనూ అనేక హక్కులను, సమస్యలను ఈ సంఘం ద్వారానే పరిష్కరించుకున్నామన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సంఘం ఎప్పుడు ముందుంటుందని ఆయన అన్నారు. వచ్చే నెలలో రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకోబోతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి పెద్దపల్లి జిల్లాకు చెందిన ఏ ఒక్క జర్నలిస్టు కూడా ఇంటి స్థలం గాని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు గాని మంజూరు కాలేదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న అమరవీరుల స్థూపం వద్ద జిల్లా అధ్యక్షుడు సంపత్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమైనదని ఆయన అన్నారు. కానీ ఆ కార్యక్రమం ఇప్పుడే చేపట్టవద్దని, మరొకసారి దశల వారీగా పోరాటం చేద్దామని ఆయన సూచించారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకుంటే మలి విడత పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. జూన్ రెండవ తేదీ వరకు జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. అలాగే మండల కేంద్రాల్లో ఒకరోజు నిరసన ర్యాలీలు నిర్వహించి తహసిల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టాలని అన్నారు. జిల్లాలో ఉన్నటువంటి మూడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ నిరసన దీక్షలు చేపట్టాలని అన్నారు. ఈ నెలాఖరులో చలో కలెక్టరేట్ పేరిట పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేయాలని ఆయన సూచించారు. జిల్లా అధ్యక్షులు సంపత్ కుమార్ మాట్లాడుతూ జూన్ 2న ఆమరణ నిరాహార దీక్ష చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర అధ్యక్షులు సూచన మేరకు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ఈ నెలాఖరు వరకు చేపట్టబోయే నిరసన కార్యక్రమాల తేదీలను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అందుకు జర్నలిస్టులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎం వంశీ, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ టీకే శ్రీనివాస్, జిల్లా దాడుల నివారణ కమిటీ కన్వీనర్ సి పెళ్లి రాజేశం, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణదాసు అశోక్, విజయ్ కుమార్, పోతరాజు సమ్మయ్య, పొన్నం శ్రీనివాస్, జిల్లా కోశాధికారి పెండ్యాల రామ్ కుమార్, జాయింట్ సెక్రటరీలు కొమురవెల్లి భాస్కర్, కే చంద్రమోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ముత్యాల నర్సయ్య, బాలసాని రాజయ్య, సురభి శ్రీధర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కే ఎల్ మూర్తి యాదవ్, గౌస్ పాషా, గిరవేణ రాకేష్, ఆరెల్లి మల్లేష్, బాలాజీ సింగ్, తాటి పెళ్లి శ్రీనివాస్, ఇజ్జగిరి శ్యామ్, దబ్బెట శంకర్, గడ్డం రవీందర్, ఆర్ మృత్యుంజయం, పెద్దపల్లి, పాలకుర్థి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చింతకింది చంద్ర మొగిలి, కొంకటి రవీందర్, యూనియన్ పెద్దపల్లి మండల అధ్యక్ష, కార్యదర్శులు వీరమల్ల విద్యాసాగర్, ఆకుల రమేష్, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్, గొర్రె తిరుపతి, మాదాసు శ్రీనివాస్, పి కుమార్, తదితరులు పాల్గొన్నారు.