రాష్ట్ర రూపురేఖలు మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దే
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని, మే 7(కలం శ్రీ న్యూస్):వందల ఏండ్ల క్రితమే మహనీయులు మన గురించి ఆలోచన చేశారని,మన భవిష్యత్ తరాల కోసం పోరాటం చేశారని, వారి స్పూర్తితోనే ఈ ప్రాంత ప్రజల్లో ఆలోచన మొదలవుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆదివారం మంథని మండలం ఎగ్లాస్‌పూర్ శివారులోని చందూలాల్ గండిపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు మహనీయుల చరిత్ర చాటిచెప్పే బాధ్యత తీసుకున్నానని, మహనీయుల చరిత్ర ఏమున్నదో ఈ ప్రాంతంలో అనేక ఏండ్లుగా పరిపాలన చేస్తున్న వారి చరిత్ర ఎలాంటిదో చెప్పాలని ఆరాటపడుతున్నామని అన్నారు. ఆనాడు మహనీయులు జ్యోతిరావుపూలే ప్రతి ఒక్కరికి చదువు రావాలని, మహిళలకు అక్షరజ్ఞానం ఉండాలని ఆలోచన చేశారని అన్నారు. అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గొప్పగా ఆలోచన చేసి ఆయన రాసిన రాజ్యాంగంలో పొందుపర్చిన రిజర్వేషన్‌లు పది ఏండ్లు మాత్రమే ఉండాలని, అటు తర్వాత అందరూ సమానం కావాలని, అందరూ ఆర్థికంగా బలోపేతం కావాలని, రాజ్యాధికారంలోకి అన్ని కులాలు రావాలని కోరుకున్నారని ఆయన గుర్తు చేశారు. కానీ ఈ నియోజకవర్గంలో అనేక ఏండ్లుగా ప్రజల ఓట్లతో అధికారంలో ఉంటున్న ఆ కుటుంబం రాజ్యాంగాన్ని తుంగలొ తొక్కిందన్నారు. 40ఏండ్లుగా ఒక్కరికి పదవులు ఇవ్వకుండా ఒక్క కుటుంబమే అధికారంలో ఉంటున్నారని ఆయన విమర్శించారు. అయితే అనేక ఏండ్లు అధికారంలో ఉన్నా కనీసం ప్రజల గురించి ఏనాడు ఆలోచన చేయలేదని, వారిని పట్టించుకున్నపాపాన పోలేదన్నారు. ఎగ్లాస్‌పూర్ సమీపంలోని చందూలాల్ గండిపై అనేక ప్రమాదాలు జరిగి వందల మంది చనిపోతున్నా ఏ మాత్రం స్పందించలేదన్నారు. ఈ రహదారి నుంచి ఆనాడు తండ్రి ఈనాడు కొడుకు రాకపోకలు సాగించినా కనీసం ప్రమాదాలు, చావుల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వందల కుటుంబాలు రోడ్డున పడ్డా పట్టించుకోలేదని, అంటే ఈ ప్రాంతం అభివృధ్ది కావద్దు. ప్రజలు చీకట్లోనే ఉండాలన్నదే తండ్రి ఆశయమా అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ ఎంతమంది చనిపోయినా ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డా అవి మావి కాదని, మా కుటుంబం మాత్రం అమెరికాలో సంతోషంగా విలాసవంతంగా ఉంటామనే ఆలోచన చేయడమేనా తండ్రి ఆశయమా అని ఆయన విమర్శించారు. అసలు తండ్రి ఆశయాలు ఏంటో ప్రజలకు వివరించాలని ఆయన ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. 40ఏండ్లుగా మన ఓట్లతో గెలిచి మనల్ని ఓటు వేసే యంత్రాలుగానే చూశారని, మనపై ఏ మాత్రం ప్రేమ లేదని ఆయన దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలకు సేవ చేయాల్సిన ఆ కుటుంబం ప్రజలను చీకట్లోనే ఉంచి ప్రజల చావులకు కారణమైండ్లని ఆయన అన్నారు. కానీ ఈ మట్టిలో పుట్టిన తనకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ప్రజలు కష్టాలు తీర్చానని, చందూలాల్ గండిపై రహదారి విస్తరణ చేసి ప్రమాదాలతో పాటు ఏ ఒక్క చావులేకుండా చేశానని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాంతంలోని చదువుకున్నప్రతీ ఒక్కరు 40ఏండ్ల పాలనకు, నాలుగేండ్ల పరిపాలనకు మధ్య తేడాను బేరీజు వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ రోడ్డు విస్తరణ ఒక్కటే కాదని నాలుగు ఏండ్లలో నియోజకవర్గంలో అనేక అభివృధ్ది పనులు చేశామని, ఈ విషయాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులపై ఉందన్నారు. మహనీయుల స్పూర్తితోనే ఆనాడు సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని, సాధించుకున్నతెలంగాణ రాష్ట్రాన్ని అభివృధ్ది చేసుకుంటున్నామని ఆయన అన్నారు. వివిధ పన్నుల ద్వారా ప్రజలు చెల్లించే ఆదాయాన్ని ప్రజలకే చెందాలని రాష్ట్ర రూపు రేకలు మార్చి దేశానికి ఆదర్శంగా నిలుపుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మహనీయుల స్పూర్తితోనే ఈ ప్రాంతానికి వెలుగులు వస్తాయని, ఈ ప్రాంత ప్రజలకు మహనీయుల చరిత్రను చాటి చెప్పి వారిలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.