మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్ ల రద్దుకై పోరాటాన్ని కొనసాగిద్దాం..
మంథని మే 1(కలం శ్రీ న్యూస్ ):మేడేను పురస్కరించుకొని సోమవారం మంథనిలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. మంథని ఆర్టీసీ డిపో వద్ద ఎస్ డబ్ల్యూ ఎఫ్ డిపో కార్యదర్శి ఆర్.రాజయ్య జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీ చౌక్ లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చింతల గోవింద్ జెండా ఆవిష్కరించారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ ప్రముఖ న్యాయవాది సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు కే. రగోతంరెడ్డి మంథని విద్యార్థి వ్యవస్థాపక అధ్యక్షులు కొండెల మారుతి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ల సందీప్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మేడే స్ఫూర్తిగా కార్మికులు సాధించుకున్న హక్కులను కాల రాస్తుందని విమర్శించారు. కార్మికులకు 26 రకాలుగా ఉన్న కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడులను తీసుకువచ్చి కార్మికులకు ఉరితాడులుగా మార్చిందని విమర్శించారు. కార్మికులు కష్టర్జితంగా గా ఏర్పడ్డ ప్రభుత్వ సంస్థలను అప్పనంగా విదేశీ స్వదేశీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అప్పగిస్తుందని విమర్శించారు. కార్మిక రంగాలలో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ కార్మికులను ఐక్యం కాకుండా కుట్ర చేస్తుందని వాపోయారు. ఈరోజు కూడా దేశవ్యాప్తంగా ఎనిమిది గంటల పని దినం అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికులతో అధిక పని గంటలు పని చేసుకుని పెట్టుబడిదారులు లాభాలను ఆర్జిస్తున్నారని దుయ్యబట్టారు. పని ప్రదేశంలో కార్మికులకు రక్షణ లేక సరైన సౌకర్యలు లేక ,మహిళలు వివక్ష గురవుతున్నారని తెలిపారు. ప్రపంచ కార్మికులరా ఏకం కండి పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. అనే నినాదాన్ని స్మరిస్తూ మే డే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ రద్దుకై పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్మికులు సింగారపు గట్టయ్య,మల్లేష్, సమ్మయ్య, ఆంజనేయులు, వైఏస్ రెడ్డి, భాగ్యలక్ష్మి, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.