రైతు బాంధవుడు కేసీఆర్…
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి అత్యధిక ప్రాధాన్యం
మంథని సహకార సంఘం ద్వారా 34 ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ
సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని ఏప్రిల్ 24(కలం శ్రీ న్యూస్ ):దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి అత్యధిక ప్రాధాన్యాన్ని ఇస్తూ సకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను దళారుల బారి నుంచి కాపాడుతున్న రైతు బాంధవుడు కేసీఆర్ అని మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని అక్కెపల్లి లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ప్రారంభించగా, నగరంపల్లి కేంద్రాన్ని సింగిల్విండో ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, మహాబూబ్ పల్లి కేంద్రాన్ని సంఘ డైరెక్టర్ ఆకుల రాజబాపు, పుట్టపాక కేంద్రాన్ని ఎంపిటీసీ పెగడ శ్రీనివాస్, బిట్టుపల్లి కేంద్రాన్ని సర్పంచ్ పోగుల సదానందం, గద్దలపల్లి కేంద్రాన్ని సర్పంచ్ బుద్ధార్థి రవి, ఎంపిటీసీ తొంబురపు సుజాత-తిరుపతి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎక్కడా లేని విధంగా ఎకరానికి సంవత్సరానికి రూ.10వేలు రైతుబంధు ఇస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు.గతంలో ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే గత ఆంధ్రా పాలకులు వారి కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబీమా పథకం ప్రవేశపెట్టి పది గుంటల భూమి ఉన్న రైతు మరణించినా వారి కుటుంబాలకు రూ.5 లక్షల రైతు బీమా వారం రోజుల్లోనే అందిస్తున్నారని అన్నారు. మంథని సహకార సంఘం ద్వారా అత్యధికంగా 34 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తూ రైతులకు బాసటగా నిలుస్తున్నామని తెలిపారు. రైతులు శుభ్రపర్చి ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకువచ్చి ఏ గ్రేడు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు హమాలీలకు మధ్య ఏమైనా సమస్యలు ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధులు చొరువ తీసుకుని వాటిని పరిష్కరించి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలని అన్నారు. గతంలో దళారుల చేతుల్లో ధాన్యం పోసి మోసపోయే పరిస్థితుల నుంచి రైతే రాజుగా ఉండాలని చెప్పి రాష్ట్రముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి రవాణా ఖర్చులు లేకుండా వారి గ్రామంలోనే కళ్లాలను ఏర్పాటు చేసి వారం రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. జెడ్పీచైర్మన్ పుట్ట మధూకర్, మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ సహాయ సహకారాలతో రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో సంఘ డైరెక్టర్లు కొత్త శ్రీనివాస్, సర్పంచులు సిద్ద రాజయ్య, రొడ్డ మమత- శ్రీనివాస్, అలుగువెల్లి స్వరూప – వీరారెడ్డి, సిఈఓ మామిడాల అశోక్ కుమార్, నాయకులు అన్న పద్మ-పర్వతాలు, మోతె శ్రీనివాస్ రెడ్డి, జంగ దేవేందర్ రెడ్డి, తెల్సురి కుమార్, మంథని సదయ్య , రైతులు, పలువురు ప్రజాప్రతినిధులు, సంఘ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.