చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం..
మంథని ఏప్రిల్ 21(కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణంలోని ప్రధాన రహదారి పై ఉన్న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం ధ్వంసం చేయడం కలకలం రేపింది. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజలు 2014లో ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేయించిన విగ్రహాన్ని స్థానిక అంబేద్కర్ నగర్ కు చెందిన రాజయ్య అనే వ్యక్తి రాడ్ తో దాడి చేశాడు. ఐలమ్మ విగ్రహం మొహంపై రాడ్ తో బలంగా కొట్టడంతో ఆమె ముక్కు, కండ్లు దెబ్బతిన్నాయి. ఎవరు ఊహించకుండా ఒకసారి దాడి చేయడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. రాజయ్య చేతిలో రాడ్లు, కత్తులు ఉండడంతో స్థానికులు వారించలేకపోయారు. దాడి అనంతరం రాజయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాజయ్య ఇటీవల కూడా బ్రిడ్జి సమీపంలోని సఫాయి కర్మచారుల విగ్రహాన్ని సైతం చెత్త పోసి కాలపెట్టాడు.గత కొంతకాలంగా రాజయ్య సరిగా మతి స్థిమితం లేకుండా తిరుగుతూ ఇలా ప్రవర్తిస్తున్నారని స్థానికులు వెల్లడించారు. ఐలమ్మ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.