Monday, February 10, 2025
Homeతెలంగాణజనాలకు దరిచేరని "జనరిక్"

జనాలకు దరిచేరని “జనరిక్”

జనాలకు దరిచేరని “జనరిక్”

రోగం ఒక్కటే. మందు ఒక్కటే. పని చేసే విధానం ఒక్కటే. కానీ, ధరల్లో మాత్రం భారీ వ్యత్యాసం. అయినా, చాలా మంది బ్రాండెడ్‌ మందులకే మొగ్గు చూపుతున్నారు. ప్రజల అవగాహనా రాహిత్యం, వైద్యుల ప్రోత్సాహం.. వెరసి చవకగా లభించే జనరిక్‌ మందులకు చెప్పుకోదగ్గ ఆదరణ లభించడం లేదు. స్థోమత లేనివాళ్లు కూడా ఖరీదైన మందులపై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. బ్రాండెడ్‌, జన రిక్‌ మందుల మధ్య వ్యత్యాసం, పనితీరులో తేడాలు, నిరాదరణకు కారణాలు…..

సుల్తానాబాద్, ఎప్రిల్ 20,(కలం శ్రీ న్యూస్):సామాన్యుడికి అతి తక్కువ ధరకు ఔషధాలను అందించటమే ‘జనరిక్‌ మెడిసిన్‌’ లక్ష్యం. జనరిక్‌ మందులను భారత్‌, చైనా తదితర దేశాల్లో తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి.. జనరిక్‌ (జనరిక్‌ మాత్రమే). వీటికి బ్రాండ్‌ పేరుండదు. ఇవి ప్రధానంగా ప్రభుత్వ దవాఖానలు, వైద్య సంస్థలలో మాత్రమే దొరుకుతాయి. రెండు.. ట్రేడ్‌ జనరిక్‌. వీటిని ట్రేడ్‌ ఫార్మసిస్టులు పంపిణీ చేస్తారు. వీటికి పరిశోధన, నాణ్యత లాంటి ప్రమాణాలేం ఉండవు. మూడు.. బ్రాండెడ్‌ జనరిక్‌. ఈ కోవలోకి వచ్చేవాటికి మాత్రం బ్రాండ్‌ పేరు ఉంటుంది. ఇవి ఔషధ పరిశ్రమలలో తయారవుతాయి, సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ ద్వారా భారీ ప్రచారం కల్పిస్తారు. అందువల్ల ఖరీదు కూడా ఎక్కువే. పారాసిటమోల్‌ అనే మందు క్రోసిన్‌ లేదా కాల్పాల్‌ పేరిట మార్కెట్లో లభిస్తుందని మనకు తెలిసిందే. ఈ బ్రాండెడ్‌ మందుపై పారాసిటమోల్‌ అనే అసలు సిసలు రసాయనిక నామం మాత్రం చిన్నక్షరాలతో కనిపిస్తుంది. మందు తయారీ కంపెనీలు బల్క్‌ డ్రగ్స్‌ తయారు చేస్తే, వీటిని సరైన రూపంలో అందివ్వడానికి ఫార్ములేషన్‌ కంపెనీలు ఉంటాయి. బల్క్‌డ్రగ్‌కి ఈ కంపెనీలు రంగు, రూపం ఇచ్చి మాత్రలు, సిరప్‌, ఇంజక్షన్స్‌ రూపంగా తయారుచేస్తాయి. మనిషి రక్తంలోకి ప్రవేశించి, రోగాన్ని నయం చేసేందుకు ఉద్దేశించిన రసాయనమే అసలు సిసలు మందు. ఈ పదార్థం బ్రాండెడ్‌లో అయినా, జనరిక్‌లో అయినా ఒకటే.

ఎలాంటి తేడా ఉండదు 

జనరిక్‌ మందులు నాణ్యమైనవేనా? అన్నది సామాన్యుడి అనుమానం. జనరిక్‌ అయినా బ్రాండెడ్‌ అయినా తయారీ నాణ్యత, పనితీరు ఒకే విధంగా ఉంటాయి. కాల పరిమితి ముగియడంతో, మొదటి ఉత్పత్తిదారుడు పేటెంట్‌ అధికారం కోల్పోయిన తర్వాత, ఇతరులు ఆ మందును తయారు చేసుకుంటారు కాబట్టి, తక్కువ ధరకే అమ్మగలుగుతారు. తయారీలోనూ, మార్కెటింగ్‌లోనూ అదనపు ఖర్చు ఉండదు కాబట్టే, ఇది సాధ్యపడుతుంది.

ఎందుకు ఇంత ఖరీదు?

ఒక మందును మార్కెట్లో విడుదల చేయడం అన్నది ఓ పెద్ద పని. కొత్త ఔషధాన్ని కనిపెట్టాలంటే లోతైన ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. అందుకు నిపుణులైన శాస్త్రవేత్తలు కావాలి. అత్యాధునికమైన ల్యాబ్‌ అవసరం. వ్యయ ప్రయాసలను భరించి పరిశోధనలు చేసినా, కొన్ని సందర్భాల్లో సత్ఫలితాలు రావు. ఫార్ములా తయారైనా, ప్రయోగదశకు వచ్చేసరికి వికటిస్తాయి. మార్కెట్‌కు పంపక ముందే చేజేతులా ధ్వంసం చేయకతప్పని పరిస్థితి. అంతా అనుకున్నట్టే జరిగినా వందలకొద్దీ ఉద్యోగుల జీతభత్యాలు, వైద్యుల కమీషన్లు, పంపిణీ ఖర్చు, రవాణా ఇలా ప్రతి దశలోనూ వ్యయాలు ఉంటాయి. ఒక టాబ్లెట్‌ తయారుచేయటానికి ఐదు రూపాయలు అయిందంటే.. దాని చుట్టూ అల్లుకున్న వలయాన్ని ఛేదించేసరికి ఖర్చు తడిసి మోపెడవుతుంది. దీనికి కంపెనీలను నిందించాల్సిన పనిలేదు. ఒక మందుల కంపెనీ ఏండ్ల తరబడి పరిశోధనలు చేసి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక కొత్త ఔషధాన్ని కనిపెడితే, ఆ మందుపై పేటెంట్‌ కాలపరిమితి 20 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. కాలపరిమితి తీరిన వెంటనే ఫార్ములాను విడుదల చేయాల్సిందే. అంటే పరిశోధన, ప్రయోగాలు ఈ తతంగమేదీ లేకుండానే, అదే ఫార్ములాతో మిగతా కంపెనీలు కూడా మందులను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీయే) అనుమతి తీసుకుంటే సరిపోతుంది. ఆ తంతు పూర్తి కాగానే, రకరకాల పేర్లతో విడుదల చేసుకోవచ్చు.

ఆదరణ ఎందుకు లేదు?

తక్కువ ధరే అయినా, ప్రజలు జనరిక్‌ వైపు వెళ్లడం లేదు. వైద్యులు కూడా ‘జనరిక్‌’ మందులను సిఫార్సు చేయడం లేదు. ప్రజల మంద మనస్తత్వమే దీనికి ఒక కారణం. ఖరీదైన మందులు వాడితేనే రోగం నయమవుతుందన్న నమ్మకం ఒకవైపు, చౌకబారు మందులవల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయన్న అపోహ మరోవైపు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ఉదాహరణకు – బ్రాండెడ్‌ పారాసిటమాల్‌ మాత్రల స్ట్రిప్‌ ఖరీదు రూ.20 రూపాయలు ఉంటే, జనరిక్‌ మందు ఖరీదు కేవలం రూ.8 మాత్రమే. ధర విషయంలో ఇంత వ్యత్యాసం ఉండటంతో ‘జనరిక్‌’ మందులు పని చేయవేమోనన్న అపనమ్మకంతో అత్యధికులు బ్రాండెడ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎటువంటి రోగమైనా క్షణాల్లో నయం కావాలి, రోగం తగ్గడానికి రోజులూ నెలలూ పట్టకూడదని అనుకునేవారే ఎక్కువ. ఈ ధోరణి మారాలి. వీటికితోడు అల్లోపతికి మించింది లేదన్న ప్రగాఢమైన నమ్మకం నరనరాల్లోనూ జీర్ణించుకు పోవటంవల్ల కూడా జనరిక్‌ మందులపట్ల మొగ్గు చూపకపోవటానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నది. ఇవన్నీ ఒక ఎత్తయితే, డాక్టర్లకూ ప్రముఖ మందుల ఉత్పత్తి కంపెనీలకూ మధ్య రహస్య ‘అవగాహన’ ఉండటంతో నాణ్యతను పక్కనబెట్టి.. ఆయా ఉత్పత్తులను జనం నెత్తిన రుద్దుతున్నారు. ‘జనరిక్‌’ మందుల గురించిన ప్రచారం అంతంత మాత్రంగా ఉండటం వల్ల కూడా ఈ షాపులవైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు.

జనరిక్‌ ఔషద రూపంలోతక్కువ రేటుకు దొరుకుతుందనే విషయం చాలా మందికి తెలియదు. బ్రాండ్‌ మందులకు ఏమాత్రం తీసిపోని జనరిక్‌ మందులు అందుబాటులో ఉంటాయని అవగాహన ఉండదు. ఒక వేళ ఉన్నా…జనరిక్‌ మందుల్లో నాణ్యత ఉండదూ అపోహా కలిగించే వారు అధికం. దీనిపై ప్రజల్లోనూ సరైన అవగాహన లేదు. మరో విషయం ఏందంటే చదువుకున్న వారిలో సైతం జనరిక్‌ మందుల గురుంచి పూర్తి అవగాహన లేదు. ఇదిలా ఉంటే వైద్యులు మాత్రం తాము రాసే మందులను మాత్రమే వేసుకోవాలంటారు. వెరే మందులను కొనుగోలు చేస్తే వైద్యం చేయడానికి నిరాకరిస్తారు. ప్రజల్లో కూడా జనరిక్‌ మందులపై అపోహాలు ఉన్నాయి. జనరిక్‌ మందులనేవి పనిచేయవని, నాణ్యత లేనివని, తగిన మోతాదులో మందు ఉండదని, తయారు చేసే విధానంలో సాంకేతిక నైపుణ్యం పాటించరని…అందువల్లే చౌక ధరలకు విక్రయిస్తున్నారని దుష్ప్రచారం సాగుతోంది. కొంత మంది ప్రభుత్వ వైద్యులు జనరిక్‌ మందులను రెఫర్‌ చేస్తున్నప్పటికీ అవగాహనలేమితో ప్రజలు ఆ ఔషదాలను తిరస్కరిస్తున్నారు. ప్రజల్లో కూడా ఈ రకమైన అపోహాలు ఉన్నాయి. కానీ ఖరీదైన మందులు మాత్రం దొరకటం లేదు. జనరిక్‌ మందుల షాపులు కూడా నగరంలో చాలా తక్కువగా ఉన్నాయి. వీటి సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. జనంలో ఈ జనరిక్‌ మందుల వినియోగంపై అవగాహనను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. గతంలో ప్రధాని నరేంద్రమోడి వైద్యులు జనరిక్‌ మందులనే రాయాలి అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అమలు అయ్యే విధంగా గట్టి మార్గదర్శకాలను ప్రభుత్వాలే రూపొందిచాల్సిన అవసరం ఉంది

 

 

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!