కన్నూరి రాజశేఖర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి
ప్రజా సంఘాల డిమాండ్_
మంథని ఏప్రిల్ 19(కలం శ్రీ న్యూస్ ):ముత్తారం మండలం దర్యాపూరు గ్రామానికి చెందిన దళితుడైన కన్నూరి రాజశేఖర్ పై అదే గ్రామానికి చెందిన గ్రామ సర్పంచి భర్త బిఆర్ఎస్ నాయకుడు గాదం శ్రీనివాస్ ఆయన అనుచరులు దాడి చేయడం జరిగింది. ఈరోజు ప్రజా సంఘాల నాయకులు దర్యాపూర్ గ్రామానికి చెందిన కన్నూరి రాజశేఖర్ ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ ఏప్రిల్ మాసంలో మహానీయులైన డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ జ్యోతిబాపూలే డాక్టర్ అంబేద్కర్ లా జయంతి ఉత్సవాలు వాడవాడలా ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల సాక్షిగా ఒక దళితుడిపై దాడి చేయడం బాధాకరమని అన్నారు.దళిత బంధు లంచం దళారి వాటా డబ్బులు ఇవ్వనందుకు సర్పంచి భర్త గాదె శ్రీనివాస్ కన్నూరి రాజశేఖర్ ను గ్రామపంచాయతీ కార్యాలయానికి పిలిపించి ఏకపక్షంగా చంకలో ఉన్న చిన్న పాపను కూడా చూడకుండా భౌతికంగా దాడి చేయడం ఇది దుర్మార్గమని అన్నారు.సాక్షాత్తు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సాక్షాత్తు గ్రామ సర్పంచి భర్త దాడి చేయడం హేయమైన చర్య అని ఈ సంఘటనను ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కన్నూరి రాజశేఖర్ పై భౌతికంగా దాడి చేసిన వారిపై ఎస్ టి ఎస్ సి అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కివిపిఎస్ మాజీ జిల్లా నాయకులు మంథని లింగయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సురేష్ తదితరులు ఉన్నారు.