అంబేద్కర్ జయంతి వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని, ఏప్రిల్ 14(కలం శ్రీ న్యూస్ ):అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగం రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ప్రపంచమంతా మేధావి అంటే కాంగ్రెస్సోళ్లు మాత్రం మేధావి అని చెప్పరని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.బారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహేబ్,డా, బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా మంథని పట్టణంలోని రాజగృహ నుంచి అంబేద్కర్ జయంతి యాత్రను నిర్వహించి ప్రధాన చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,ప్రజల అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ప్రధాన చౌరస్తాలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
అంబేద్కర్ ప్రపంచ మేధావి అని ఇప్పటికి కాంగ్రెస్సోళ్లు చెప్పరని, రాజ్యాంగం రచించిన ఏడుగురిలో ఆయన ఒక్కడని చెప్తారే తప్ప మేధావి అని ఒప్పుకోరని ఆయన తెలిపారు. ఆనాడు తమ కుటుంబం, పిల్లలు అని ఆలోచన చేయకుండా అణగారిన వర్గాలు అభివృద్ది చెందాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని గొప్ప ఆలోచన చేశారని అన్నారు. ఆనాడు జరిగిన చరిత్ర ఈనాడు జరుగుతున్న చరిత్రను ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. మంథనిలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా కేవలం ఎస్సీ సామాజికవర్గాలు మాత్రమే చేసేవని, కానీ ఈనాడు ఎస్సీలు బీసీలు ఒక్కటై మహనీయులు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మార్పు రావాలనే తాను ఆరాటపడుతున్నానని, మహనీయులు కోరుకున్నది కూడా ఇదేనని ఆయన వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన 76ఏండ్లలో అనేక ఏండ్లు పరిపాలన చేసిన పాలకులు ఏనాడు మహనీయుల చరిత్ర చెప్పలేదని, కనీసం ఏ ఒక్క మహనీయుడి విగ్రహం కన్పించేలా చేయలేదన్నారు. చరిత్ర తెలిస్తే చైతన్యం వస్తుందని, తమ కుర్చీలు ఉండవని మహనీయుల చరిత్రను దాచిపెట్టారని అన్నారు. కానీ నియోజకవర్గంలో మాత్రం ఒక్క నాయకుడి చరిత్ర చెప్పే ప్రయత్నం చేసి విగ్రహాలు పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. శ్రీపాదరావుకు ఏం చరిత్ర ఉందని విగ్రహాలు నెలకొల్పారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆనాడు దళిత బిడ్డ పార్లమెంట్ సభ్యురాలు తమ దేవుడి విగ్రహాన్ని మంథనిలో చూపించాలనే ఆలోచనతో అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటు చేస్తే విగ్రహ ఆవిష్కరణను అడ్డుకున్న చరిత్ర దుద్దిళ్ల కుటుంబానిదేనన్నారు. అలాగే మహదేవ్‌పూర్‌లో కొమురంభీం విగ్రహాం పెట్టాలని చూస్తే ఆవిష్కరణకు వచ్చిన మాజీ ఎంపీ కవితను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విగ్రహాన్ని పోలీస్‌స్టేషన్ పెట్టించిన చరిత్ర కూడా వారిదేనన్నారు. గొప్పగా ఆలోచన చేసి అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పితే దళితబిడ్డ సుగుణకుమారిని విగ్రహ ఆవిష్కరణకు రాకుండా చేశారని కనీసం విగ్రహాన్ని ముట్టుకోనియ్యలేదని ఆయన గుర్తు చేశారు. ఆనాడు విగ్రహా ఆవిష్కరణను అడ్డుకున్న నాయకుడే ఈనాడు అదే విగ్రహానికి దండలేసి దండం పెడుతున్నాడని అన్నారు. తాను మంథని నియోజకవర్గంలో అంబేద్కర్‌తో పాటు మహనీయుల చరిత్రను చాటిచెప్పకపోతే ఈనాడు ప్రస్తుత ఎమ్మెల్యే అంబేద్కర్‌ను ముట్టుకునేవాడా ఇలా మీటింగ్‌లు పెట్టేవాడా అని ఆయన ప్రశ్నించారు. దాచిపెడితే దాగేది చరిత్ర కాదని, ఆలస్యంగా తెలిసినా ఆ చరిత్ర మన జీవితాలను ఇస్తుందన్నారు. ఆనేక ఏండ్లు శ్రీపాదరావుకు ఓట్లు వేసి గెలిపించిన మనల్ని ఏనాడు గౌరవించలేదని, మహనీయులకు సరైన గౌరవం ఇయ్యలేదన్నారు. ఈనాడు శ్రీపాదరావు వర్థంతి, జయంతిలను ఘనంగా జరుపుకోవడాన్ని తాను తప్పు పట్టడం లేదని, కానీ మహనీయుల వర్థంతి జయంతి వేడుకలను ఎందుకు జరుపుకోవడంలేదో కాంగ్రెస్‌పార్టీలో ఉన్న ఎస్సీలు,బీసీలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీపాదరావు ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు అంబేద్కర్‌వాసులు మురుగులోనే ఉన్నారని, దుర్వాసనతో ఎన్ని ఇబ్బందులు పడినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కానీ మంథని సర్పంచ్‌గా పుట్ట శైలజ, ఎమ్మెల్యేగా తాను ఎన్నికైన తర్వాత అంబేద్కర్‌వాసుల కష్టాలు తీర్చామని, వారికి మంచి వాతావరణం కల్పించే దిశగా ప్రయత్నం చేసిన చరిత్ర మాదేనన్నారు. ఈ నాటికి ఎమ్మెల్యే కుటుంబాన్ని నమ్మే నాయకులు ఆలోచన చేయాలని, ఏ కార్యకర్తకు కుర్చి ఇవ్వకుండా వాళ్లే కుర్చిల్లో కూర్చుంటున్నారని, మన వర్గాల మధ్య కొట్టాటలు పెట్టి కూర్చీల్లో కూర్చునే కుటుంబమని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ మహనీయులను గౌరవిస్తూ వారికి సముచిత స్థానం ఇస్తోందని, ఈనాడు ఆకాశమంత ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించుకోవడం జరుగుతుందని, అలాగే రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ నామకరణం చేయడం జరిగిందన్నారు. మంథనిలో రాజకీయ చైతన్యం కోసం నితంతరం పోరాటం చేస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి మహనీయుల జయంతి వర్థంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.