డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధం
హైదరాబాద్,ఎప్రిల్13(కలం శ్రీ న్యూస్):భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ విగ్రహం దేశంలో ఇప్పటివరకూ ఉన్న అంబేడ్కర్ విగ్రహాల్లో కెల్లా ఎత్తయినదిగా ఖ్యాతి గడించబోతోంది. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠం, ఆపైన 125 అడుగుల నిలువెత్తు లోహ విగ్రహాన్ని ఈ నెల 14న అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
హుస్సేన్‌సాగర్ తీరంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యేలా రవాణా సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరయ్యేలా 750 బస్సులను ఆయా ప్రాంతాలకు పంపనుంది. దాదాపు 50 వేల మంది కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.