Tuesday, October 8, 2024
Homeతెలంగాణపార్టీకి కార్యకర్తలే బలం...బలగం: రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పార్టీకి కార్యకర్తలే బలం…బలగం: రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పార్టీకి కార్యకర్తలే బలం…బలగం: రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

మంథని, ఏప్రిల్ 7(కలం శ్రీ న్యూస్ ):పార్టీకి నాయకులకు కార్యకర్తలే బలం..బలగమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.కమాన్‌పూర్‌ మండలం ఆదివరహస్వామి ఆలయ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హజరయ్యారు. ఈ కార్యక్రమానికి హజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్ఫాస్టక్చర్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కమాన్‌పూర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌,భూపాలపల్లి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ ఘనస్వాగతం పలికారు.అనంతరం బైక్‌ర్యాలీతో ఆదివరహస్వామి ఆలయానికి చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ కార్యకర్తలను విస్మరిస్తే పార్టీ మనుగడకు ప్రమాదమన్నారు.నాయకులు కార్యకర్తలను కలుపుకుని పనిచేయాలని ఆయన సూచించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షాలు అనేక ఎత్తుగడలు వేస్తూ మన పార్టీని బదనాం చేసేందుకు కుట్రలు చేస్తుంటారని, అలాంటి కుట్రలను కలిసికట్టుగా ఎదుర్కొవాలన్నారు.పార్టీలో వర్గాలు, గ్రూపు రాజకీయాలకు చోటు ఉండద్దనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌,మంత్రి కేటీఆర్‌ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారని,ఈ సమ్మేళనాల్లో కార్యకర్తలు తమ కష్టసుఖాలు,పార్టీ పరిస్థితులపై చర్చించుకోవాలన్నారు. మండలస్థాయిలో ఆత్మీయసమ్మేళనాలు నిర్వహించి గ్రామ స్థాయిలో నిర్వహించాలన్నారు. గ్రామశాఖల ఆధ్వర్యంలో వివిధ విబాగాల్లో సుమారు 110మంది కార్యకర్తలు పనిచేస్తారని,వారితో కలిసి గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని ఆయన సూచించారు.ఎన్నికల సమయంలో మా సత్తా డబ్బాల్లో చూపిస్తామనే మాటలు ఉండవద్దని, ఈనాడు కష్టపడితేనే డబ్బాల్లో ఫలితాలు కన్పిస్తాయే కానీ మాటలతో కాదని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా లబ్ది చేకూరుతోందని, నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా లబ్ది చేకూరని మనిషి ఉండడని, 30శాతం మంది లబ్ది పొందినా విమర్శలు చేస్తూనే ఉంటారని, మిగతా 70శాతం మంది సానుకూలంగా ఉంటారన్నారు. సంక్షేమ పథకాలపై ఎవరెన్ని విమర్శలు చేసినా తిప్పి కొట్టాలని, అధికారంలో ఎవరచ్చినా పథకాలు అందుతాయని చెబుతారని, కానీ ఇలాంటి పథకాలు కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తూ ఎన్నో కట్టుకథలు చెబుతారని, అలాంటివి ప్రజలునమ్మకుండా మనపై విశ్వాసం ఉండేలా పనిచేయాలన్నారు. గ్రామస్థాయిలోనైనా ప్రతి ఇంటింటికైనా వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలన్నారు. 40ఏండ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చేసింది శూన్యమేనని, ఆనాడు అధికారంలో ఉన్నా ప్రాజెక్టులు కట్టలేదని, ఉచితంగా కరెంటు ఇవ్వలేదని, రైతులకు రైతుబంధు, రైతుబీమా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. వృద్యాప్య పించన్‌ కేవలం రూ.200మాత్రమే ఇచ్చే వారని, ఈనాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో వృద్దులకు రూ,2వేలు, దివ్యాంగులకు రూ.3వేల పించన్‌ అందించి చరిత్రలో నిలిచారన్నారు. గుజరాత్‌లో ప్రధాని మోడీ ప్రభుత్వం వృద్దులకు రూ.600, దివ్యాంగులకు రూ.950మాత్రమే ఇస్తుందన్నారు. గ్రామస్థాయి నుంచి పటిష్టంగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని, గ్రామాల్లోని నాయకులు కష్టపడి పనిచేయాలని, ఎక్కడైనా సమస్య ఉంటే జెడ్పీ చైర్మన్‌ అక్కడకు వచ్చి సమస్యకు పరిష్కారం చూపుతారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ గొప్ప ఆలోచనతో నిర్వహించే కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలతో బలమైన శక్తిగా మారాలని, అలా జరిగితే ప్రజలే బ్రహ్మరథం పడుతారని ఆయన స్పష్టం చేశారు.

మంథనికి రాని నాయకుడు కావాలా,మంథని విడిచిపోని నాయకుడు కావాలా…ఎర్రోళ్ల శ్రీనివాస్‌. రాష్ట్ర మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్ఫాస్టక్చర్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌


ఎన్నికల్లో గెలిచినంక హైదరాబాద్‌కే పరిమితమై మంథనికి రాని నాయకుడు కావాలా లేక ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ మంథని నుంచి బయటకు పోని నాయకుడు కావాలా అని రాష్ట్ర మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్ఫాస్టక్చర్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. కమాన్‌పూర్‌ మండలంలోని ఆదివరహస్వామి ఆలయం ఆవరణలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రితో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కసికెడు నీళ్లు దొరుకలేదని విమర్శించారు. చుట్టూ గోదావరి నది పోతున్నా ప్రాజెక్టులు కట్టాలని, రైతులకు సాగు నీరు అందించాలని ఏనాడు ఆలోచన చేయలేదని, చిన్నకాళేశ్వరం మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసిండ్లని ఎద్దేవా చేశారు. ఆనాడు ప్రాజెక్టు కట్టకుంటనే పనులు చేయకుంటనే బిల్లులు ఎత్తుకున్నచరిత్ర కాంగ్రెస్‌దని ఆయన అన్నారు. కానీ ఈనాడు అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్పగా ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజక్టు నిర్మించి రైతులకు సాగునీరు అందించడంతో పాటు హైదరాబాద్‌కు తాగునీరు అందించి చరిత్రలో నిలిచారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల కళ్లలో ఆనందం కన్పించిందన్నారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం తన పదవి వదులుకోని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అధికారంలో ఉన్నన్నిరోజులు హైదరాబాద్‌ నుంచి మంథనికి రావాలంటే పెద్దపల్లినుంచి మంథని దాకా పోలీసులను పహారా పెట్టించేవారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు ఎవరు నోరు విప్పినా కేసులుపెట్టించే వారని, ప్రత్యేక రాష్ట్రం వచ్చినంక ఎవరిపైనా కేసులు అయ్యాయా అని ఆయన ప్రశ్నించారు. గులాబీజెండా వచ్చినంకనే ఎస్సీ, ఎస్టీలకు స్వతంత్య్రం వచ్చిందన్నారు. మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్‌ అయ్యాకనే ఈ ప్రాంతానికి అభివృద్దిబాటలు పడ్డాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అంటేనే భరోసా,రక్షణ, సంక్షేమమనే విషయాన్నిప్రతి కార్యకర్త, నాయకులు గమనించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు లీడర్‌ లేడని, బీజేపీకి ఓటరు లేదని, టీడీపీకి క్యాడర్‌లేదని,బీఆర్‌ఎస్‌కు ఎదురులేదని ఆయన అన్నారు. ఈ విషయాలపై ప్రజల్లో చర్చపెట్టాల్సినబాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్‌ గల్లంతు చేయాలని ఆయన సూచించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్నిబదనాం చేసేందుకు బీజేపీ అనేక కుట్రలు చేస్తోందని, ఇందులో బాగంగానే పేపర్‌లీక్‌లని ఆయన అన్నారు. ఢిల్లీలో ప్రధాని వీక్‌ లీడర్‌ అని, గల్లీలో బండి సంజయ్‌ లీక్‌ లీడరని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఎంతో మంది కార్మికుల కుటుంబాలు ఆధారపడ్డ సింగరేణిని సంస్థను కాపాడాలని ఆయన సవాల్‌ చేశారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్‌,బీజేపీ విధానాలను వివరించాలని, ఆనాడు గ్యాస్‌సిలిండర్‌ ధర రూ.650ఉంటే ఈనాడు మోడీ ప్రభుత్వంలో రూ.1200చేరిందని వివరించాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయని, ఈ విషయాలను ప్రజలకు వివరిస్తూ చైతన్యంచేయాలన్నారు. అలాగే రాష్ట్రంలో ఏ పార్టీ, ఏ నాయకుడు వచ్చినా ఈ పథకాలన్నీ బంద్‌ చేస్తారనే విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యకర్తను లీడర్‌ చేసే ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ అని, పదవులు వెనుకా ముందు వస్తాయని, ఓర్పుతో ఉండాలే కానీ పార్టీని బదనాం చేసే ప్రయత్నాలు చేయవద్దని ఆయన పిలుపునిచ్చారు.

నోట్ల కట్టలకు కమాన్‌పూర్‌ వాసులు లొంగలే…పుట్ట మధూకర్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌

ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ పార్టీని ఏ విధంగా భూస్థాపితం చేయాలని చూసిన కమాన్‌పూర్‌ ప్రజలు నోట్ల కట్టలకు లొంగలేదని బీఆర్‌ఎస్‌పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. కమాన్‌పూర్‌ మండలం ఆదివరహస్వామి ఆలయ ఆవరణలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రితో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కమాన్‌పూర్‌ మండలం అంటేనే ఒక స్పూర్తి అని కొనియాడారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నోట్ల కట్టలతో అన్ని మండలాలకు వస్తే ఒక్క కమాన్‌పూర్‌ మండలం మాత్రమే మెజార్టీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. 2014ఎన్నికల్లో ఉమ్మడి కమాన్‌పూర్‌ మండలం 6వేల మెజార్టీ ఇవ్వగా విభజన తర్వాత 2018లో కమాన్‌పూర్‌ మండలం 1900 మెజార్టీ ఇచ్చిందన్నారు. మండలంలోని కమాన్‌పూర్‌టౌన్‌, గుండారం మినహా మిగతా గ్రామాలన్నీ కాంగ్రేస్‌కే ఓట్లు వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమాన్‌పూర్‌ నుంచి ఆదర్శనగర్‌ వరకు మంత్రిగా పనిచేసిన శ్రీధర్‌బాబు ఏం చేశాడో గమనించాలన్నారు. అవగాహన లేకుండా ఎంతోమంది ప్రజలు కాంగ్రెస్‌ మాయమాటలకు మోసపోయి ఓట్లు వేస్తున్నారని ఆయన అన్నారు. మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబు ఆనాడు ఎల్లంపల్లి నుంచి టూ టీఎంసీ నీళ్లకు ముత్తారంకు తీసుకెళ్లాడే కానీ మధ్యలో ఉన్న కమాన్‌పూర్‌ మండలానికి చుక్కనీళ్లు ఇవ్వలేదని, నీటి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు.కానీ తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎల్లంపల్లినుంచి టూ టీఎంసీ పైపులైన్‌ ద్వారా రాణాపూర్‌, నాగారం, పేరపల్లి గ్రామాలకు సాగునీరు అందించానని ఇలాంటి విషయాలపై కార్యకర్తలు చర్చ పెట్టాల్సిన అవసం ఉందన్నారు. అనవసరపు విషయాలపై చర్చ పెట్టే నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి పనికి వచ్చేలా చర్చించాలన్నారు. కాటారం మండలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌పార్టీకే మెజార్టీ ఇస్తారని, ధన్వాడ ప్రజలు సైతం కాంగ్రెస్‌కే ఓట్లు వేస్తారని, అసలు కాటారం మండలానికి ఎమ్మెల్యే కుటుంబం ఏం చేసిందో ఆలోచన చేయాలన్నారు. ఎలాంటి అభివృద్ది చేయని ఎమ్మెల్యే కుటుంబానికి ఓట్లు వేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో పుట్టిన వాళ్లు ఎంతో మంది ఉన్నారని, టీడీపీ పార్టీని పుట్టించిన వాళ్లు ఉన్నారని, అయితే ఎమ్మెల్యే కుటుంబం ఎన్నోకుట్రలు, కుతంత్రాలు చేసి నాయకులకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా వారి ఎదుగుదలను అడ్డుకున్నారని ఆయన వివరించారు. కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి కసాయి కుటుంబాన్ని తరిమికొట్టాలన్నారు. చెంచెడు నీళ్లుపోయని, పైసా సాయం చేయని కుటుంబం నుంచి విముక్తి చేయాలనే ఆరాటంతో పోరాటం చేస్తున్నానని ఆయన అన్నారు. ఒకవైపు దేశం గర్వించే విధంగా సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు అమలుచేస్తూ ప్రజల్లో విశ్వాసం పొందుటుంటే ఇక్కడ మాత్రం పార్టీని విచ్చిన్నం చేయాలనే స్వంత పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆన్నారు. నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలు అప్పగించిన నాయకుడిని విస్మరిస్తూ పార్టీలో విభేధాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలను కార్యకర్తలు పట్టించుకోవద్దని, పార్టీని నిలబెట్టేలా పనిచేయాలన్నారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంతో కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!