యువత చైతన్యానికి కొండేల మారుతి తపన అభినందనీయం
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని ఏప్రిల్ 04(కలం శ్రీ న్యూస్ ):గత పాలకుల నిర్లక్ష్యం మూలంగానే మంథని ప్రాంతం అనేక ఏండ్లుగా వెనుకబాటుకు గురైందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.మంగళవారం మంథని పట్టణంలోని ఫ్రెండ్స్‌క్లబ్‌లో మంథని విద్యార్ధి యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెడ్పీ చైర్మన్‌తో ముఖాముఖిలో ఆయన పాల్గొని మాట్లాడారు.అనేక ఏండ్లు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసిన పాలకులు మన అభివృధ్దిని పట్టించుకోలేదన్నారు.అయితే నాటి నుంచి నేటి వరకు ఓటు విలువ తెలియకపోవడం మూలంగానే సరైన నాయకుడిని ఎన్నుకోలేకపోయామని, ఓటు విలువ తెలిసి ఉంటే ఈనాడు అగ్రస్థానంలో ఉండేవాళ్లమన్నారు. నియోజకవర్గానికి ఒకవైపు గోదావరినది,మరోవైపు మానేరు, ఇంకోవైపు అటవీ సంపద, మరోవైపు బొగ్గు సంపద ఉన్నా చీకటి రాజ్యమే ఏలిందన్నారు, సహజవనరులను ఉపయోగించుకుని ఉంటే ఈనాడు ఎంతో పురోభివృద్ది చెందేవాళ్లమన్నారు.కేవలం అధికారం కోసమే ఆనాడు ఆరాటపడ్డారని, అలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉండకూడదన్నారు.ఇప్పటికే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, తూర్పు, పశ్చిమ గోదావరి తరహాలో మంథనిని సుందరీకరించేందుకు ప్రయత్నంచేస్తున్నామని తెలిపారు.మంథని విద్యార్ధి యువత వ్యవస్థాపకులు కొండెల మారుతి ఏదో ఒక కార్యక్రమం ద్వారా యువతలో చైతన్యం తీసుకురావడానికి,సమస్యల పరిష్కారం కోసం తపన పడుతున్నాడని,ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ముఖాముఖి కార్యక్రమం ద్వారా కొన్ని సమస్యలు తమ దృష్టికి వస్తాయని,మరికొన్ని అభివృధ్ది పనులు వెలుగులోకి వస్తాయని ఆయన చెప్పారు.కాగా పలువురు వివిధ సమస్యలను జెడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకురాగా వాటిపై స్పందించి వివరించారు.గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలోప్రభుత్వం ఉందని, ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద దానికి సంబందించిన ప్రణాళిక ఉందన్నారు.అలాగే అంతర్గత రహదారుల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.మంథని చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని,బోయిన్‌పేట నుంచి రింగ్‌రోడ్డు నిర్మాణం జరుగుతుందని, బన్నచెరువు మీదుగా ఎగ్లాస్‌పూర్ వరకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. అలాగే విద్యా వైద్య రంగాల అభివృద్దికి తనవంతు కృషి చేస్తానన్నారు.